రెండో పెళ్లయితే?
సమాజం దారి ఏర్పాటు చేస్తుంది. ఆ దారినే మళ్లీ ప్రశ్నిస్తుంది. చిన్నచూపు చూస్తుంది. హేళన చేస్తుంది. సమాజంలో మొదటి పెళ్లికి ఉన్న గౌరవం రెండో పెళ్లికి ఉందా? రెండో పెళ్లి చేసుకోవడం వల్ల అన్యాయం జరిగినట్టేనా? ఈ భావనలు ఒకమ్మాయి మనసులో తుఫాను రేపితే?
ఫస్ట్ జరుగుతున్నది ఆ అమ్మాయి బాబాయ్ కనిపెట్టాడు. అతను కనిపెట్టకపోతే కథ ఎక్కడి దాకా పోయేదో. ఆ రోజు సాయంత్రం ఆఫీసు దగ్గర వసుధ బాబాయ్‌ని చూసి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. 'నమస్తే మావయ్యా... ఇలా వచ్చారేమిటి?' అన్నాడు. 'నీతో మాట్లాడాలి శ్రీకాంత్' అన్నాడు బాబాయ్. ఇద్దరూ దగ్గరలో ఉన్న కాఫీషాప్‌లో కూచున్నారు. 'శ్రీకాంత్... వసుధ మీద నీ ఒపీనియన్ ఏమిటి?' అడిగాడు బాబాయ్ 'మంచమ్మాయి. ఆ అమ్మాయిని చేసుకొని నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకలా అడిగారు?' 'ఆ అమ్మాయి హ్యాపీగా ఉందనుకుంటున్నావా?' 'ఉందనే అనుకుంటున్నాను' అయోమయంగా అన్నాడు శ్రీకాంత్. 'కాని ఆ అమ్మాయి లేదు. లేనని అనుకుంటోంది. ఎంతగా అంటే తన కాలేజీ నాటి ఫ్రెండ్‌తో డీప్‌గా ఫ్రెండ్‌షిప్ చేసేంత అనుకుంటోంది.
రెండు రోజుల క్రితం తను అతనితో నాకు రెస్టరెంట్‌లో కనిపించింది' బాబాయ్ చెప్పింది విని శ్రీకాంత్ ఒక నిమిషం బిగుసుకుపోయాడు. 'ఇందులో మన తప్పు కూడా ఉంది. ఆ అమ్మాయిని నీతో పెళ్లికి సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఒకసారి మనం వసుధను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఏమంటావ్?' 'మావయ్యా... నాకు వసుధ అంటే నిజంగానే ప్రేమ ఉంది. తప్పకుండా తీసుకెళదాం' అన్నాడు శ్రీకాంత్. వసుధ ప్రవర్తన గురించి తనకు తెలిసిన విషయాన్ని పట్టుకుని ఆ రాత్రి ఇంట్లో రాద్ధాంతం చేయలేదు శ్రీకాంత్. కూల్‌గా వసుధతో మాట్లాడాడు. 'వసుధ... నువ్వు నీ కాలేజ్ మేట్ సాగర్‌తో క్లోజ్‌గా ఉంటున్నావా?' ఒక్క క్షణం వసుధ తుళ్లిపడింది. అప్పటి వరకూ ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు, తన ప్రవర్తన గురించి తనకే డౌట్ ఉన్నట్టు, తాను చేస్తున్నది సరైనదో కాదో తేల్చుకోలేనట్టు, ఒకవేళ భర్తకు తెలిస్తే జరిగే పరిణామాలను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానో లేనో తెలియనట్టు... వసుధ సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది.
'ఏడవకు... ఏడవకు' ఊరడించాడు శ్రీకాంత్. 'నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదండీ' అంది వసుధ సిన్సియర్‌గా. 'సరే... మనం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలుద్దాం' అన్నాడు శ్రీకాంత్. వసుధ చక్కగా ఉంటుంది. బాగా చదువుకుంది. ఎవరైనా సరే ఇష్టపడి పెళ్లి చేసుకునేలా ఉంటుంది. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తన కంటే ముందు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆ ముగ్గురికీ పెళ్ళిళ్లయ్యేలోపు వసుధకు ఒకటి రెండు మంచి సంబంధాలు వచ్చాయి. కాని పెద్దపిల్లల పెళ్లి అయ్యేంత వరకూ చివరి పిల్ల వసుధకు పెళ్లి చేయడం సాధ్యం కాదని తల్లిదండ్రులు ఊరుకున్నారు. ముగ్గురి పెళ్లిళ్లు అయ్యేసరికి ఆర్థికంగా పెద్దగా ఏం మిగల్లేదు. సరిగ్గా అప్పుడే తమ బంధువుల్లో ఉన్న శ్రీకాంత్ సంబంధం వచ్చింది. శ్రీకాంత్ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం ఉంది. కాని పెళ్లయిన నాలుగునెలలకే భార్య నుంచి విడిపోయి సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నాడు.
అతను మంచివాడేనని ఆ అమ్మాయి ఎందుకో అతనితో అడ్జెస్ట్ కాలేకపోయిందని అతడు కూడా ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండలేకపోయాడని వసుధ తల్లిదండ్రులకు సంబంధం తెచ్చినవారు చెప్పారు. వసుధను శ్రీకాంత్‌కు ఇచ్చి చేయడానికి తల్లిదండ్రులకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు. వసుధను మంచి సంబంధం అని ఒప్పించారు. వసుధకు కూడా అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది. ఓకే అంది. 'కాని అందరూ నన్ను బాగా హింస పెట్టారు డాక్టర్' అంది వసుధ సైకియాట్రిస్ట్‌తో. 'ఎలా?' అని అడిగాడు సైకియాట్రిస్ట్. 'పెళ్లికి నా ఫ్రెండ్స్‌ని పిలిచాను. అందరూ వచ్చారు. వెళ్లారు. పెళ్లి బాగా జరిగింది. కాని ఒకరోజు ఒక ఫ్రెండ్‌తో నేను చేసుకుంది రెండో పెళ్లి అతన్ని అని చెప్పాను. క్యాజువల్‌గా అవునా అంది. కాని మా సర్కిల్ అంతా ప్రచారం చేసింది. అందరూ నాకు ఫోన్‌లు చేసి ఒకటే సానుభూతి చూపడం. నీకేం తక్కువని... నీకేం అవసరమని... మమ్మల్ని అడిగితే రాజాలాంటి సంబంధం తెచ్చేవాళ్లం... పోయిపోయి రెండో సంబంధంవాణ్ణి చేసుకుంటావా... అయ్యో రెండో సంబంధమా... మొదటి భార్య ఎందుకు వెళ్లిపోయిందో... వాడు శాడిస్ట్ ఏమో... నిన్ను కూడా సరిగ్గా చూసుకోడులే ఇలా నా మనసు నిండా విషం నింపారు.
నాకు రాను రాను అవన్నీ నమ్మాలనిపించింది. అవి నమ్మిన వెంటనే నాకు రెండో పెళ్లివాడికిచ్చి చేసిన నా తల్లిదండ్రులపై పీకల్దాకా కోపం వచ్చింది. మా ముగ్గురక్కలు ఈ పెళ్లి వద్దన్నారట. అంటే వాళ్లు వద్దనేంత అన్యాయం ఏదో నాకు జరిగిపోయినట్టే కదా. ఇవన్నీ ఆలోచించి డిస్ట్రబ్ అయ్యాను' అంది వసుధ. బయట ఆమె భర్త, బాబాయ్ కూచుని ఉన్నారు. 'తర్వాత' అన్నాడు సైకియాట్రిస్ట్. 'నా మనసు నిండా మొదటి పెళ్లివాణ్ణి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అన్న ఆలోచన నిండిపోయింది. ఈలోకానికి ఎలాగైనా మొదటిపెళ్లివాణ్ణి చేసుకొని చూపించాలన్నంత కోపం, కసి వచ్చాయి. అప్పుడే నా కాలేజ్‌మేట్ సాగర్ కనిపించాడు. అప్పట్లో అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను నో చెప్పాను. కాని నా సంగతి విని ఇప్పుడైనా మించిపోయింది లేదు చేసుకుంటాను అని మాటలు మొదలెట్టాడు. ఒకటి రెండుసార్లు అతన్ని కలిశాను. కాని నాకు అది కరెక్టో కాదో అని అనిపించేది. ఇటు శ్రీకాంత్.. అటు సాగర్... మెడలో తాళి... ఇదంతా నరకంగా ఉంది డాక్టర్' అంది వసుధ.
'ఇప్పుడు నీ మనసులో ఏముంది?' 'నాకు మంచి జీవితం పొందాలని ఉంది' 'మంచి జీవితం శ్రీకాంత్ నీకు ఇస్తున్నాడు కదా. అతను నీ కన్ఫ్యూజన్ గురించి తెలిసినా రాద్ధాంతం చేయకుండా నా దగ్గరకు తీసుకొచ్చాడంటేనే నువ్వంటే ఎంత గౌరవమో అర్థమవుతోంది. సెకండ్ మేరేజ్ రాంగ్ మేరేజ్ అనే భావన నీ మనసులో తీసేయ్. నువ్వు ప్రేమించగలిగే నిన్ను ప్రేమించగలిగేవాడు దొరికిన పెళ్లే మంచి పెళ్లి. అది మొదటిదా రెండోదా అని లెక్కలు ఎందుకు? జనానిదేముంది... ప్రతిదానికీ మాట్లాడతారు. శ్రీకాంత్ మొదటిపెళ్లి నుంచి బయటపడి అలాగే ఖాళీగా ఉండిపోతే జనం ఊరుకుంటారా? రాజాలా ఉంటావు... రాణిలాంటి సంబంధం తెస్తాము చేసుకో అని వారే అంటారు. చేసుకున్నాక ఆ వచ్చిన అమ్మాయికి వాళ్లే పుల్లలు పెడతారు. కాబట్టి మనకు ఏది మంచో అది ఎంచుకుని ముందుకెళ్లాలి. నీకు నిజంగా శ్రీకాంత్ అంటే ఇష్టమేనా?' 'ఇష్టం సార్' 'ఇంకా సాగర్‌తో మాట్లాడాలని ఉందా?' ఆ అమ్మాయి మెల్లగా ఫోన్ తీసి సాగర్ నంబర్ బ్లాక్ చేసింది. కాసేపటికి బాబాయి, శ్రీకాంత్, వసుధ డాక్టర్‌కు థ్యాంక్స్ చెప్పి ఒక నిశ్చింతతో ఇంటికి మరలారు.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్