‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు

'శప్తభూమి'కి సాహిత్య అవార్డు


సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన 'శప్తభూమి'నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 4 వ్యాసాలు, ఒక నాన్‌ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది.

 
23 భారతీయ భాషలలో జ్యూరీ సభ్యులు సిఫారసు చేసిన రచనలను అకాడెమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదించి అవార్డులను ప్రకటించింది. తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్‌ వి.చినవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. బండి నారాయణస్వామి రాయలసీమ రచయితగా గుర్తింపు పొందారు. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా, గడ్డం మోహన్‌రావు రాసిన 'కొంగవాలు కత్తి'నవలకు అకాడెమీ యువ పురస్కార్‌ లభించింది. 'తాత మాట వరాల మూట'రచనకు గాను బెలగం భీమేశ్వరరావుకు అకాడెమీ 'బాల సాహిత్య పురస్కారం'ప్రకటించింది.


ధరూర్‌ పుస్తకం, నంది కిశోర్‌ కవిత
కాంగ్రెస్‌ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్‌ ఆచార్య తదితర 23 మంది రచయితలున్నారు. థరూర్‌ ఆంగ్లంలో రాసిన 'యాన్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌'పుస్తకం, నందకిశోర్‌ ఆచార్య హిందీలో రాసిన 'చలాతే హుయే ఆప్నే కో'కవితకు ఈ పురస్కారం లభించింది.    విజేతలకు వచ్చే ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే  కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు.


ఏపీ సీఎం జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆయన చేసిన రచనలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు.


Popular posts